నారా లోకేష్ ను పదవి నుంచి తొలగించండి: జగన్

  • ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీనా లేక మోసం చేసిన డీఎస్సీనా అని జగన్ ప్రశ్న
  • డేటీ లీక్ చేసి, మెరిట్ లిస్టులను మాయం చేస్తూ ద్రోహం చేశారని మండిపాటు
  • అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్

ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించింది మెగా డీఎస్సీనా లేక నిరుద్యోగులను మోసం చేసిన దగా డీఎస్సీనా అని వైసీపీ అధినేత జగన్ నిలదీశారు. తమ హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి, కావాలనే ఆలస్యం చేస్తూ కొత్త నోటిఫికేషన్‌తో పబ్లిసిటీ చేసుకున్నారని విమర్శించారు. తీరా చూస్తే పేపర్లు లీక్ చేసి, డేటా డిలీట్ చేసి, మెరిట్ లిస్టులను మాయం చేస్తూ అభ్యర్థులకు పెద్ద ద్రోహం చేశారని మండిపడ్డారు. ఈ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ను తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించాలని, ఈ లీకులపై సీబీఐ చేత విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.


పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న ఒక ఎస్ సీఈఆర్టీ (SCERT) అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చిందో సమాధానం చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారో, మెరిట్ లిస్టులను ఎందుకు దాచారో, టాపర్ వివరాలను ఎందుకు తొలగించారో స్పష్టం చేయాలన్నారు. కేవలం సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్‌లు పంపి, కలెక్టర్ ఆఫీసుల్లో సెలక్షన్ లిస్టులు పెట్టకపోవడం వెనుక పెద్ద మతలబు ఉందన్నారు. 


డీఎస్సీలో ‘స్పోర్ట్స్ కోటా’ పోస్టులను ఒక్కొక్కటి రూ.15 లక్షలకు అధికార పార్టీ నాయకుడే ఇంటికి పిలిచి బేరసారాలు సాగించారని ఆరోపించారు. క్రీడా మైదానంలో అడుగుపెట్టని వారికి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు అమ్ముకున్నారని, ఇది రిక్రూట్‌మెంటా లేక వేలం పాటా అని ధ్వజమెత్తారు. టెట్ కన్వీనర్‌గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్‌గా ఉన్నప్పటికీ... ఉన్నపళంగా ఆయన్ను తొలగించి జాయింట్ డైరెక్టర్‌ను కన్వీనర్‌గా ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఈ మెగా అవినీతిపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే లోకేష్‌ను పదవి నుంచి తప్పించి, సీబీఐ దర్యాప్తు కోరి ప్రతిభ గల అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


Nara Lokesh
Jagan
YS Jagan
DSC Scam
Andhra Pradesh DSC
Mega DSC
AP DSC Exam
Chandrababu
SCERT
AP Politics

More Telugu News